
మండిపడ్డ చిన్నారెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్
హైదరాబాద్, వెలుగు: రాజకీయంగా జన్మ నిచ్చిన పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని, ఆయనకు కాంగ్రెస్ శ్రేణులే సరైన సమాధానం చెప్తాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాజగోపాల్‌పై విశ్వాసం లేకనే హైకమాండ్ ఆయనకు పీసీసీ పదవి ఇవ్వలేదని పేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్‌లో సీనియర్ నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ తదితరులు విడివిడిగా ప్రెస్ మీట్ పెట్టి రాజ్‌గోపాల్‌పై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి రాజగోపాల్ అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీకి ఎందుకు వెళ్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మునుగోడు కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, అక్కడ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంటుందని చెప్పారు. ఈ నెల 5న మునుగోడులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తోడుదొంగలని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కలేనని, కేసీఆర్ లాంటి అవినీతిపరులపై సీబీఐ ఎంక్వైరీ వేసినప్పుడే ప్రజలు నమ్ముతారని చిన్నారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఆయన మూడేండ్ల నుంచి బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీకి పనిచేసి, రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన సేవల్ని గుర్తించే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ గా అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో జనతా పార్టీలో చేరినవారంతా కనుమరుగయ్యారని, ఇప్పుడు రాజగోపాల్ కు అదే గతి పడుతుందని మల్లు రవి హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోవడం కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని, అయితే..ఆయనను మునుగోడు ప్రజలు పాతాళానికి పడేస్తారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు బ్రాండ్ ఉందని భావిస్తూ పార్టీలో ఇప్పటివరకు వారి గురించి ఎవరూ మాట్లాడలేదని, ఆ అన్నదమ్ములకు పార్టీ లైఫ్ ఇచ్చిందని పేర్కొన్నారు. వ్యాపారాలను కాపాడుకోవడానికే ఈటల, రాజగోపాల్ రెడ్డి బీజేపీ పంచన చేరారని, టీఆర్ఎస్, బీజేపీకి రేవంతే టార్గెట్ అని అద్దంకి దయాకర్ అన్నారు. రూ.600 కోట్ల కంపెనీకి 22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని, బీజేపీ చేతిలో రాజగోపాల్ రెడ్డి పావుగా మారారని పీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ దుయ్యబట్టారు. రాజగోపాల్ తో చర్చకు తాను సిద్ధమని, ఎక్కడికి వస్తారో డిసైడ్ చేసుకోమని ఆయన సవాల్ విసిరారు.