Allu Arjun-SnehaReddy: నీలోఫర్‌ కేఫ్‍లో అల్లు అర్జున్ దంపతులకు చేదు అనుభవం.. ఫ్యాన్స్ మధ్య చిక్కుకున్న స్నేహారెడ్డి!

Allu Arjun-SnehaReddy: నీలోఫర్‌ కేఫ్‍లో అల్లు అర్జున్ దంపతులకు చేదు అనుభవం.. ఫ్యాన్స్ మధ్య చిక్కుకున్న స్నేహారెడ్డి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రేజ్ కొన్ని సార్లు ఇబ్బందులకు దారితీస్తుంది. శనివారం సాయంత్రం ( జనవరి 4, 2026 ) హైదరాబాద్ లోని నీలోఫర్ కేఫ్ వద్ద సరిగ్గా ఇదే జరిగింది.  ఒక కార్యక్రమం ముగించుకుని భార్య స్నేహరెడ్డితో కలిసి సరదగా బయటకు వచ్చిన బన్నీకి అభిమానుల తాకిడితో ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది.

ముంచెత్తిన అభిమాన గణం

హైదరాబాద్ కోకాపేటలో తాను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'అల్లు సినిమాస్' థియేటర్ సాఫ్ట్ లాంచ్‌ను పూర్తి చేసుకున్న అనంతరం, అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి నీలోఫర్‌ కేఫ్ కు వెళ్లారు. తొలుత అంతా బాగానే ఉన్నా, విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా కేఫ్ వద్దకు చేరుకున్నారు. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది.

ఊహించని రీతిలో ఫ్యాన్స్ తాడికి...

సెల్ఫీల కోసం, తమ అభిమాన నటుడిని దగ్గర నుంచి చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా తోపులాటను ఆపలేకపోయారు. ఈ క్రమంలో స్నేహారెడ్డి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన అల్లు అర్జున్, తన భార్యకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆమెను గట్టిగా పట్టుకుని రక్షణగా నిలిచారు.

పెద్ద ఎత్తున అభిమానుల తాకిడితో.. ఆ సమయంలో అల్లు అర్జున్ చాలా ఆందోళనగా కనిపించారు. అయితే సంయమనం కోల్పోకుండా అభిమానులను వెనక్కి వెళ్లమని అభ్యర్థించారు బన్నీ. తన భార్య స్నేహా రెడ్డిని సురక్షితంగా కారు వరకు తీసుకెళ్లి.. సీట్లో కూర్చోబెట్టారు. చివరకు ఫ్యాన్స్ తాడికి నుంచి ఊపిరి పీల్చుకున్న బన్నీ  అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. 


 
అల్లు సినిమాస్ ప్రత్యేకతలు

శనివారం సాయంత్రం జరిగిన 'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవంలో బన్నీ తన కుమారుడు అయాన్‌తో కలిసి సందడి చేశారు. ఈ థియేటర్ అత్యాధునిక Dolby Cinema ఫార్మాట్‌తో రూపుదిద్దుకుంది. సంక్రాంతి కానుకగా ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ థియేటర్ లోపల అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ ,మెగాస్టార్ చిరంజీవిల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక మ్యూరల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

బిజీగా అల్లు అర్జున్..

ప్రస్తుతం అల్లు అర్జున్..  స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ (AA22)లో నటిస్తున్నారు.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా కొంతమేరకు పూర్తి చేసుకుంది. 

ఇటీవల విజయ్, అజిత్, సమంత, నిధి అగర్వాల్ వంటి స్టార్లు కూడా ఇలాగే అభిమానుల మధ్య చిక్కుకుని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ జాబితాలో అల్లు అర్జున్ చేరడం చర్చనీయాంశంగా మారింది. అభిమానం ఉండాలి కానీ అది సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.