ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగాలు చేసిన కొద్ది గంటలకే, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ ఆదివారం చైనా పర్యటన ప్రారంభించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. అయితే జూన్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లీ జే మ్యుంగ్ చైనాకు ఇదే తొలి పర్యటన.
ఈ పర్యటనలో లీ జే మ్యుంగ్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. వీరిద్దరూ గత రెండు నెలల్లో కలవడం ఇది రెండోసారి. జపాన్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనా ఇప్పుడు దక్షిణ కొరియాతో ఆర్థిక సహకారాన్ని, పర్యాటకాన్ని పెంచుకోవాలని చూస్తోంది.
తైవాన్ విషయంలో జపాన్ చేసిన వ్యాఖ్యల వల్ల చైనా అసంతృప్తిగా ఉంది. మరోవైపు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేస్తూ చైనా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలను అడ్డుకోవాలని చూస్తోంది. ఈ పర్యటనలో లీ జే మ్యుంగ్ వెంట సుమారు 200 మంది వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. వీరిలో ముఖ్యులైన శామ్సంగ్ చైర్మన్ జే వై. లీ, SK గ్రూప్ చైర్మన్ చెయ్ టే-వోన్, హ్యుందాయ్ మోటార్ గ్రూప్ చైర్మన్ యుయిసున్ చుంగ్ ఉన్నారు.
►ALSO READ | బ్రెజిల్ లో బస్సు, ట్రక్కు ఢీ.. 11 మంది మృతి
ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండు దేశాలు వస్తువుల ఉత్పత్తి & సరఫరాలో పెట్టుబడులు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, రెండు దేశాల మధ్య కళలు ఇంకా సంస్కృతిని ప్రోత్సహించడం అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా ఆర్థికంగా, రాజకీయంగా కొరియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
