తిరుమలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. శనివారం ( జనవరి 3 ) ఒక్కరోజే రూ. ఐదు కోట్లు..

తిరుమలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. శనివారం ( జనవరి 3 ) ఒక్కరోజే రూ. ఐదు కోట్లు..

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపారు టీటీడీ అధికారులు .భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని... ఈ ఏడాది ప్రారంభంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్కును దాటడం విశేషమని తెలిపారు అధికారులు. 

శనివారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.5.05 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక గత ఆరు రోజులలో రికార్డు స్థాయిలో రూ 24.61 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని... గత ఆరు రోజులలో రూ. లక్షా 43 వేల129 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు అధికారులు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భాన్ని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారని... తిరుమల కొండంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోందని తెలిపారు అధికారులు. వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకోవడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారని... తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయని తెలిపారు అధికారులు.