మంగళవారం ( జనవరి 6 ) గన్నవరం ఎయిర్ పోర్టును మంచు కప్పేయడంతో ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. 128 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన విమానం శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా. దట్టమైన పొగమంచు కారణంగా విజయవాడ వెళ్లాల్సిన విమానాన్ని శంషాబాద్ కు మళ్లించినట్లు తెలిపింది ఎయిర్ ఇండియా.
సోమవారం కూడా దట్టమైన పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు ఇబ్బంది ఎదుర్కొన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా పలు విమానాలు ఇతర ఎయిర్ పోర్టులకు మళ్లించారు. విమానాలు ల్యాండ్ అవ్వడానికి పరిస్థితి అనుకూలించకపోవడంతో ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం సుమారు అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
వాతావరణంలో దట్టమైన పొగమంచు కారణంగా ఏటీసీ క్లియరెన్స్ లేకపోవడంతో ల్యాండింగ్ కోసం ఇబ్బంది ఎదుర్కొన్నాయి విమానాలు. కాసేపటి తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానాలు యధావిధిగా ల్యాండ్ అయ్యాయి.
