ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. మంగళవారం ( జనవరి 6 ) ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు. టీటీడీ అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ క్రమంలో పరకామణి కేసులో ప్రమేయం ఉన్న అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
పరకామణి కేసుకు సంబంధించి శ్రీవారి హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన సంస్కరణలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది టీటీడీ. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని కోరిన హైకోర్టు ఈ కేసు విచారణను గురువారానికి ( జనవరి 8 ) వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
వైసీపీ హయాంలో తిరుమల పరకామణి లో నగదు చోరీకి సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
