అమలాపురం: ‘మన శంకర వరప్రసాద్ గారు’ బెనిఫిట్ షో టికెట్ వేలంపాట.. లక్షా 11 వేలకు దక్కించుకున్న చిరు వీరాభిమాని!

అమలాపురం: ‘మన శంకర వరప్రసాద్ గారు’  బెనిఫిట్ షో టికెట్ వేలంపాట.. లక్షా 11 వేలకు దక్కించుకున్న చిరు వీరాభిమాని!

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ మూవీ బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్‌కు అమలాపురం టౌన్లో రికార్డ్‌ ధర పలికింది. అమలాపురం పట్టణంలోని వెంకటరమణ థియేటర్‌లో సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాట నిర్వహించగా, రూ.1.11లక్షలకు చిరంజీవి వీరాభిమాని మోకా వెంకట సుబ్బారావు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మెగా అభిమానులు.. 'ఇది కదా బాస్ స్టామినా.. మరిన్ని రికార్డులు ఖాయం' ఈ సినిమాతో అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. ఇదే క్రమంలో కొంతమంది నెటిజన్లు.. ఒక్క టికెట్టు కోసం ఇంత పెద్ద అమౌంట్ పెట్టడం ఏంటి? అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే, సినిమా టికెట్లను వేలం పాట పాడే కొత్త సంస్కృతి OG సినిమాతోనే మొదలైంది. 2025లో పవన్‌ కల్యాణ్‌ OG బెనిఫిట్ షో టికెట్ ను లక్షా 29 వేల 999 రూపాయలకు పవర్ వీరాభిమాని ఆముదాల పరమేష్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో వేలంలో టికెట్‌ దక్కించుకున్న పరమేష్‌.. ఆ టికెట్‌ డబ్బును జనసేన ఆఫీసుకు ఇస్తానని పరమేష్‌ చెప్పుకొచ్చాడు. మరి మన శంకర వరప్రసాద్ మూవీ బెనిఫిట్ షో టికెట్టు కొన్న వెంకట సుబ్బారావు, ఆ డబ్బులను ఏం చేస్తాడో తెలియాల్సి ఉంది. 

మన శంకర వరప్రసాద్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 11న ప్రీమియర్స్ పడనున్నాయి. ఇప్పటికే టీజర్,ట్రైలర్, సాంగ్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన MSG టీమ్, ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. రేపు బుధవారం, జనవరి 7వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది. ఈ మెగా విక్టరీ వేడుక సాయంత్రం 5:30 గంటల నుండి ప్రారంభం కానుందని తెలిపింది.  

సంక్రాంతి రిలీజ్ సినిమాల్లో..‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు వచ్చిన విజులవ్స్ అన్నీ సెట్ అయ్యాయి. ఇక మెగాస్టార్ మ్యానరిజమ్స్, అనిల్ రావిపూడి హిలేరియస్ కామెడీ మిక్స్ అయితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇందులో వెంకటేష్ కూడా కీలక పాత్రలో ఉండటంతో మెగా, వెంకీ అభిమానులు ఈ చిత్రం కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.