ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు కొన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు దేశాలైన భారత్, మలేషియా, ఇండోనేషియా తదితర ప్రాంతాలలో వర్షాకాలం ముగిసి చాలా రోజులైంది. చలికాలం కూడా ముగింపు దశకు చేరుకుంది. నెల రోజుల్లో ఎండాకాలం వస్తుందనే పరిస్థితుల్లో కూడా వర్షాలు కురుస్తూ ఇండోనేషియాను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలకు ఊర్లకు ఊర్లే కొట్టుకుపోతున్నాయి.
ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు భయంకరమైన నదుల్లా ప్రవహిస్తూ గ్రామాలను, పట్టణాలను ముంచెతుతున్నాయి. సోమవారం (జనవరి 05) నుంచి కురుస్తున్న వర్షాలకు.. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. తూర్పు ప్రావిన్స్ లోని నార్త్ సులవేసి ప్రాంతం పూర్తిగా వరదల్లో స్థంభించిపోయింది. భారీ వరదలకు మృతుల సంఖ్య 16 కు చేరుకుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (BNPB) ప్రకటించింది.
సోమవారం అర్థరాత్రి 2.30 ప్రాంతంలో సితారో ఐలండ్ లో గంటల తరబడి కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగటంతో గ్రామాలు, పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. నాలుగు జిల్లాల్లో 148 ఇండ్లపై ప్రభావం పడిందని.. అందులో 7 పూర్తిగా డ్యామేజ్ అవ్వగా.. 29 డ్యామేజ్ అయ్యాయని.. 112 పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రకటించింది.
►ALSO READ | రా.. దమ్ముంటే నన్ను తీసుకెళ్లు: మదురో అరెస్ట్ వేళ ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు ఛాలెంజ్
కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినప్పటికీ.. కరెంటు, సిగ్నల్ వ్యవస్థల పునరుద్ధరణ ఇంకా జరగలేదు. BNPB చీఫ్ అద్దుల్ ముహరీ చెప్పిన వివరాల కారం.. ఈ విపత్తులో 22 మంది గాయపడినట్లు తెలిపారు. మొత్తం 682 మందికి తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం కుటుంబాలు, 108 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇండోనేషియాలో గత కొద్దికాలంగా వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం తరచుగా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ జనవరి 5 నుంచి 18 వరకు 14 రోజుల ఎమర్జెన్సీ పీరియడ్ గా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
