
- సరస్వతి పుష్కరాల సందర్భంగా సొంత పార్టీకి చెందిన దళిత ప్రజాప్రతినిధికి అవమానం
- దేవాదాయ శాఖ ఆఫీసర్ల తీరుపై విస్మయం
- దళిత సంఘాల ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఫొటోలు కనిపించలేదు. సొంత పార్టీకి చెందిన దళిత ఎంపీని విస్మరించడంపై కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు మండిపడుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ నిధులతో జరిపే ఏ కార్యక్రమంలో అయినా ప్రొటోకాల్ ప్రకారం పార్టీలకు అతీతంగా ఎంపీ ఫొటోలు, పేర్లు పెట్టాల్సి ఉంటుంది.
అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న పుష్కరాల్లో ఎంపీ పేరు, ఫొటో కన్పించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌బాబు, మరో ముగ్గురు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఫ్లెక్సీలో ఉన్నాయి. కానీ, పుష్కరాలతో సంబంధం ఉన్న లోకల్ ఎంపీ వంశీకృష్ణ ఫొటోగానీ, పేరు గానీ లేదు. 3 రోజుల కిందే ఎంపీ వంశీకృష్ణ కాళేశ్వరంలో పర్యటించి, ప్రభుత్వం తరఫున చేపట్టిన పుష్కరాల పనులను పరిశీలించారు. ఈ పుష్కరాలకు ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. అయినా.. మరీ పనిగట్టుకొని ఎంపీ వంశీకృష్ణ ఫొటోనే పెట్టకపోవడంలో ఆంతర్యం ఏంటని స్థానిక దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు.
దళిత ఎంపీ అంటే చిన్న చూపా?: జక్కు శ్రావణ్
దేవాదాయ శాఖ ఆఫీసర్లకు ప్రజలు ఎన్నుకున్న దళిత ఎంపీ కనిపించడం లేదా?.. దళిత ఎంపీ అంటే అంత చిన్నచూపా? అని కాటారం దళిత నాయకుడు జక్కు శ్రావణ్ మండిపడ్డారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల స్వాగత ఫ్లెక్సీల్లో ఎక్కడా దళిత ఎంపీ ఫోటో లేకపోవడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయని చెప్పారు. బుధవారం శ్రావణ్ విలేకరులతో మాట్లాడారు. గడ్డం వంశీ ఫొటోలు పెట్టకపోవడం దళిత జాతిని అవమానపరచడమేనని అన్నారు. ఇది పార్టీ వ్యవహారం కాదని, దళితజాతిని చిన్న చూపు చూడడమేనని అన్నారు.