ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల మండిపాటు

 ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల మండిపాటు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చార న్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీలోకి చేరికలు లేక ఫ్రస్ట్రేషన్​లో ఈటల ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం గాంధీభవన్​లో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ మీడియాతో విడివిడిగా మాట్లాడారు. ఈటల ఆరోపణలు వ్యక్తిగతమా, బీజేపీ పార్టీవో చెప్పాలని స్రవంతి డిమాండ్​ చేశారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయి కదా.. కాంగ్రెస్​కు కేసీఆర్​ రూ.25 కోట్లు ఇస్తే అవి ఏం చేస్తున్నాయి?”అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్నదన్న భయం బీజేపీలో కనిపిస్తున్నదని అద్దంకి దయాకర్ విమర్శించారు. గప్పాలు కొట్టి ఈటల బీజేపీలో చేరారన్నారు. రూ.18 వేల కోట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొన్నదని ఆరోపించారు. కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈటల బీజేపీలో చేరారని ఈరవర్తి అనిల్ ఆరోపించారు. బీజేపీ నేతలు సోషల్​ మీడియాకే పరిమితమయ్యారని పీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత అన్నారు.