హైదరాబాద్, వెలుగు: బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడం కాదు.. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టాలని విప్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. సుమన్ అరెస్ట్ పై బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడమేంటని ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమన్ ఏమైనా ప్రజల కోసం పోరాటం చేశారా..? బీఆర్ఎస్అధికారం కోల్పోయిన రెండున్నరేండ్లకే ఇంత అసహనం ఎందుకని మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచే దాడులకు కుట్రలు జరిగాయని ఆరోపించారు.
సుమన్ వెనుక ఉన్నది కేసీఆర్, హరీశ్ రావే: గజ్జెల కాంతం
బాల్క సుమన్ విధ్వంసకర మాటల వెనుక కేసీఆర్, హరీశ్ రావు ఉన్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరోపించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేశారు. పాలేరులను ముందుపెట్టి రాజకీయం చేయాలని కేసీఆర్, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో కొందరు విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్అయ్యారు.
బాల్క సుమన్ బుద్ధి మారదు: చరణ్ కౌశిక్, శివసేనారెడ్డి, సుజాత
బాల్క సుమన్ బుద్ధి ఎప్పటికీ మారదని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు చరణ్ కౌశిక్, శివసేనారెడ్డి, కల్వల సుజాత విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. క్యాతన్‌పల్లి మున్సిపల్చైర్పర్సన్ఎన్నిక సందర్భంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై దాడి చేసి జైలుకు వెళ్లినా సుమన్ లో మాత్రం మార్పు రాలేదన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు అర్థంపర్థం లేని విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుమన్ ఒక ఉగ్రవాది.. సైకోలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద ఆయనపై కేసు పెట్టాలని పోలీసులను కోరారు.
