వరద బాధితులకు భరోసానివ్వాలి: కాంగ్రెస్ నేతలు

వరద బాధితులకు భరోసానివ్వాలి: కాంగ్రెస్ నేతలు
  • ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించాలె: కాంగ్రెస్ నేతలు
  • గవర్నర్ తమిళిసైతో నేతల భేటీ
  • రాష్ట్ర సర్కారు తీరుపై ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: వరదలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు వెంటనే పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించాలని.. బాధితులను పరామర్శించి, భరోసానివ్వాలని పేర్కొన్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌‌భవన్‌‌లో గవర్నర్ తమిళిసైతో సమావేశమైంది. వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదని గవర్నర్‌‌‌‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ‘‘వరి పంటకు ఎకరానికి రూ.20 వేలు, పత్తికి రూ.15 వేలు, ఇతర పంటలకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలి. పొలాల్లో ఇసుక మేటలను తొలగించేందుకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి. 

కూలిపోయిన ఇండ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలి. వరదల్లో గల్లంతై వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. వరదల్లో చనిపోయిన  ఒక్కో పశువుకు రూ.65 వేల చొప్పున వాటి యజమానులకు అందించాలి. పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. వరద బాధితుల్లో భరోసా నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని తమిళిసైకి ఇచ్చిన వినతి పత్రంలో కాంగ్రెస్‌‌ నేతలు పేర్కొన్నారు. గవర్నర్‌‌‌‌ను కలిసిన వారిలో పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్లు మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్  మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ నష్టం: భట్టి

వరద విపత్తు నుంచి ప్రజలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో భారీ నష్టం సంభవించిందని విమర్శించారు.