మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కోవర్టు భయం

మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కోవర్టు భయం

మెదక్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు కోవర్టు భయం పట్టుకుంది. ఓవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు, మరోవైపు ఎవరు కోవర్టులు, ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారో తెలియని కన్ఫ్యూజన్ వారిని వెంటాడుతోంది. మెదక్ కాంగ్రెస్ లో డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మ్యాడం బాలకృష్ణ రెండు గ్రూపులుగా ఉన్నారు. ఈ మధ్యే మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కూడా పార్టీలో చేరడంతో మూడు గ్రూపులయ్యాయి. ముగ్గురు నేతలూ ఎలక్షన్ లో పోటీకి ఇంట్రెస్ట్ గా ఉండడంతో గ్రూపు గొడవలు తట్టుకోలేకపోతున్నామంటున్నారు లోకల్ లీడర్లు.

ముగ్గురు లీడర్లు పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తుండడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులంటూ ఒకరిపై ఒకరు అంతర్గతంగా ప్రచారం చేస్తుండడంతో మరింత గందరగోళంగా తయారైంది. 2004 తర్వాత ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ గెలవలేదు. వేరే పార్టీ కోవర్టులు ఉండడం వల్లే ప్రతిసారీ ఓడిపోతున్నామన్న అనుమానాలు పార్టీ నేతల్లో ఉన్నాయి. ఇప్పుడు క్యాండేట్ల పోటీలో మరోసారి ఇదే ప్రచారం జరుగుతుండడం కేడర్ ను మరింత టెన్షన్ పెడుతోంది.

పోటీలో ఉన్న లీడర్ల మధ్య ప్రచారాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక లీడర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయని కార్యకర్తల్లో టాక్ నడుస్తోంది. మరో లీడర్ కూడా బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారంటూ ఇంకో వర్గం ప్రచారంచేస్తోంది. అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నా ఇట్లాంటి గొడవలతో వెనుకబడుతున్నామన్న చర్చ లోకల్ లీడర్లలో జరుగుతోంది. కోనాపూర్ సొసైటీ అక్రమాల వ్యవహారంతో అధికార పార్టీ అడ్డంగా దొరికిపోయినా పార్టీ పరంగా ఏం చేయలేదని కొందరు కార్యకర్తలు లీడర్ల మీదే ఫైరయ్యారు. ఇప్పటి పరిస్థితి చూస్తే మరోసారి కోవర్టు రాజకీయాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మాత్రం కేడర్ లో బలంగా వినిపిస్తున్నాయి.