ఆసుపత్రి కోసం ఏడేళ్ల‌లో ఏడు రూపాయ‌లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు

ఆసుపత్రి కోసం ఏడేళ్ల‌లో ఏడు రూపాయ‌లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు

హైదరాబాద్: గ‌డిచిన ఏడేళ్లలో ఉస్మానియా ఆసుప‌త్రి కోసం కేసీఆర్ ప్ర‌భుత్వం ఏడు రూపాయ‌లు ఖ‌ర్చు కూడా చేయ‌లేదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శ‌నివారం కాంగ్రెస్ నేత‌లు ఉస్మానియా ఆసుప‌త్రి ప్ర‌ధాన భ‌వ‌నాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ..‌ ఉస్మానియా బిల్డింగ్‌ను పరిరక్షించాలని, ఉస్మానియా బిల్డింగ్ బేసిక్ స్ట్రక్చర్ బాగానే ఉందని నిపుణుల చెబుతున్నారని తెలిపారు. నిజాం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే కేసీఆర్ ఆయన కట్టిన భవనాన్ని ఎందుకు కూల్చుతున్నాడ‌ని ప్రశ్నించారు. నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలని, వాటిని హెరిటేజ్ బిల్డింగ్స్ కింద ఉంచాల‌ని, అవసరమైతే మ్యూజియం చేయాల‌ని ఉత్త‌మ్ సూచించారు.

ఇదే కాంప్లెక్స్‌లో ఆరేకరాల ఖాళీ స్థలం ఉందని, ఆ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని, రాష్ట్రంలో కేసులు, మరణాలు పెరగడానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే కారణమ‌న్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందని తెలిసి కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవ‌టం లేద‌ని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు.