కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా  పలు తీర్మానాలు

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా  పలు తీర్మానాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలు ఇవాళ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశమయ్యారు. ఆయా వర్గాల ప్రజల సామాజిక ప్రయోజనాలను  పరిరక్షించడం, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం దక్కేలా చేయడానికి సంబంధించి ఈ భేటీలో పలు తీర్మానాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలను పార్టీకి అనుకూలంగా మార్చుకునే ఎజెండాపై చర్చించేందుకు త్వరలోనే టీపీసీసీని,  సీఎల్పీని కలవాలని నాయకులు నిర్ణయించారు. దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని కేటాయించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు హైదరాబాద్ కు ఆహ్వానించి సన్మానించాలని  నిర్ణయించారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అనుసరించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీ పదవుల్లో, రాజకీయ పదవుల్లో అవకాశాలు కల్పించాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లి  అధిష్టానానికి విజ్ఞాపన ఇవ్వాలని డిసైడ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం సాధ్యమవుతుందనే భరోసా  కల్పించేలా అన్ని సామాజిక వర్గాల ముఖ్య నాయకులతో అన్ని జిల్లాల్లో పర్యటనలు నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.  రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సందేశాన్ని తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని పాత పది (ఉమ్మడి) జిల్లాలలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో గోమాస శ్రీనివాస్,  రామాను నాయక్, కత్తి వెంకటస్వామి, జనక్ ప్రసాద్ , అద్దంకి దయాకర్, రియాజ్ అహ్మద్, చందా లింగయ్య, దొర నరేష్ జాదవ్,  భరత్ చౌహన్,  ఈర్ల కొమరయ్య,  జమున రాథోడ్, కేవీ ప్రతాప్, లక్ష్మయ్య యాదవ్,  ప్రతాప్ సింగ్, సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.