పదేండ్లు అధికారంలో ఉండి.. నిరుద్యోగులకు ఏం చేశారు

పదేండ్లు అధికారంలో ఉండి.. నిరుద్యోగులకు ఏం చేశారు
  •  బీఆర్ఎస్​పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి ఫైర్​
  • మోతీలాల్ ను రెచ్చగొట్టి దీక్ష చేయిస్తున్నరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి డిమాండ్ చేశారు. తమ హయాంలో నిరుద్యోగులకు ఏ మేలు చేయని హరీశ్​రావు సిగ్గులేకుండా ఏడు నెలల కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులే మోతీలాల్ నాయక్ ను రెచ్చగొట్టి దీక్షకు దింపారని ఆరోపించారు. 

ఎన్ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి ఆయన సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. వారి హయాంలో 16 పేపర్లు లీక్ అయిన విషయాన్ని మరిచిపోరాదన్నారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్టుగా తమ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు. నిరుద్యోగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని.. మూడునాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.

నిరుద్యోగ సమస్యలపై ఆరుగురితో కమిటీ

రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలను తెలుసుకునేందుకు ఆరుగురు సభ్యులతో పీసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, పార్టీ నేతలు మానవతా రాయ్, రియాజ్, బాలలక్ష్మి, చనగాని దయాకర్ ను ఈ కమిటీ లో నియమించారు. నిరుద్యోగులను కలిసి వారి సమస్యలను ఈ కమిటీ తెలుసుకుంటుంది. ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే వివరాలను సేకరిస్తుంది. గాంధీ హాస్పిటల్ లో మోతీ లాల్ నాయక్ చేపట్టిన దీక్షపై సోమవారం ఉదయం యూత్ కాంగ్రెస్, ఎన్‌‌ఎస్‌‌యూఐ నేతలతో మాట్లాడిన సీఎం రేవంత్.. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రవళిక మరణానికి హరీశ్ క్షమాపణ చెప్పాలి: వెంకట్​

నిరుద్యోగుల పక్షాన మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్ష చేస్తున్నారని ఎన్‌‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఆ తమ్ముడి ఆవేదన తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు గాంధీ హాస్పిటల్ కు వెళ్లామన్నారు. ప్రవళిక మరణంపై హరీశ్ రావు ముందుగా క్షమాపణ చెప్పి, ఆ తర్వాత మోతీలాల్ గురించి మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నిరుద్యోగులకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంటే.. ఆనాడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు.. రాజీనామా చేయకుండా నిరుద్యోగులను ముందేసుకున్నారని  యూత్ కాంగ్రెస్ నేత  మానవతా రాయ్ ఆరోపించారు.