పంజాగుట్ట, వెలుగు: సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం భారీ ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ నేతృత్వంలో వందలాది మంది మహిళలు ఈ నిరసనలో పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఖైరతాబాద్ ప్రధాన కూడలి మీదుగా సోమాజిగూడలోని లోక్ భవన్ వరకు కొనసాగింది. మహిళలు ప్లేట్లు, స్పూన్లతో శబ్దాలు చేస్తూ ‘వేర్ ఈజ్ మై సిలిండర్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం గవర్నర్కు వినతి పత్రం అందజేసి పెరిగిన ధరలను తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు.
దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తూ, యుద్ధ పరిస్థితులను బూచీగా చూపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు ముజాహిద్ ఆలంఖాన్, సునీతారావు, ఉస్మాన్ అల్ హజ్రి, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
