ధరణి కాదు ఇక నుంచి భూ భారతి

ధరణి కాదు ఇక నుంచి భూ భారతి
  • ధరణి స్థానంలో భూభారతి 

  •  ఆడపిల్ల పెండ్లికి 1,00116, తులం బంగారం

  •  రేషన్ లో సన్నబియ్యం.. విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్

  •  జర్నలిస్టులకు మెట్రో ఫ్రీ, ఉద్యోగులకు పాత పింఛన్ సిస్టం

  •  కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక అంశాలు


హైదరాబాద్: కాంగ్రెస్ మ్యానిఫెస్టో రేపు (నవంబర్ 17)  విడుదల కాబోతోంది. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి అప్ గ్రేడ్ యాప్ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో భూభారతి పైలట్ ప్రాజెక్టును అప్పటి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భూముల వివరాలను సేకరించింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా దానిని మళ్లీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములతోపాటు రేషన్ కార్డ్ హోల్డర్లకు సన్నబియ్యం అందించడంతోపాటు అమ్మహస్తం పేరిట 9 నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని పేర్కొంటున్నట్టు సమాచారం.

 అభయహస్తం పునరుద్ధరిస్తామని, ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపే చాన్స్ ఉంది. గ్రామాల్లోని వార్డు సభ్యులకూ గౌరవ వేతనం అందించే అంశాన్నీ మ్యానిఫెస్టోలో పెట్టినట్టు సమాచారం. జర్నలిస్టులకు మెట్రో లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పనుంది. ఇందుకోసం పాసులు జారీ చేయనున్నట్టు వివరించనుంది. మీడియా కమిషన్ ఏర్పాటు చేయనన్నట్టు తెలిపే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వనుంది. విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిచే హామీని మ్యానిఫెస్టోలో పెట్టినట్టు సమాచారం. నిరుద్యోగులకుఉద్యోగాలు, ఆటో వాలాకు ఆర్థిక సాయం ఇంకా అనేక అంశాలను కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్టు తెలుస్తోంది.