
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్నా.. ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను లాగేసుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పై గవర్నర్ చర్యలు తీసుకోకుంటే లోక్ పాల్ కు ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా నేతృత్వంలో..శనివారం రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు గవర్నర్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటన చేసిన 9 మంది ఎమ్మెల్యేల వివరాలు అందజేశారు.
పార్టీ ఫిరాయింపులు బ్లడ్ క్యాన్సర్‌లాంటిదన్న మొయిలీ.. వీటిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. సీఎ: కేసీఆర్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే ఇలాంటి పార్టీ ఫిరాయింపులపై న్యాయపరంగా ఉన్న లోపాలను సవరిస్తామని తెలిపారు వీరప్పమొయిలీ.