ఇయ్యాల తుక్కుగూడలో కాంగ్రెస్ సభ

ఇయ్యాల తుక్కుగూడలో కాంగ్రెస్ సభ
  •      హాజరుకానున్న ఖర్గే, రాహుల్
  •     తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయనున్న నేతలు
  •     గతంలో ఇక్కడే ఆరు గ్యారంటీలను ప్రకటించిన సోనియా
  •     అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్న ఏఐసీసీ

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం కాంగ్రెస్ పార్టీ జన జాతర పేరిట భారీ బహిరంగా సభను నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొననున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పది లక్షల మంది ఈ సభకు హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తుక్కుగూడ రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ ప్రాంగణంలో పీసీసీ ఏర్పాట్లు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడలో జరిగిన సభలోనే.. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. ఈ గ్యారంటీలకు ప్రజల్లో మంచి స్పందన రావడంతో పాటు, పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తూ.. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఐదు గ్యారంటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ ఐదు గ్యారంటీలతో తెలుగులో రూపొందించిన కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో బుక్‌‌‌‌‌‌‌‌ లెట్​ను ఖర్గే, రాహుల్ ఈ సభలో విడుదల చేయనున్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను వేదిక మీది నుంచి రాహుల్ గాంధీ ప్రజలకు పరిచయం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

సభ సక్సెస్​కు పీసీసీ భారీ ఏర్పాట్లు

తుక్కుగూడ సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 64 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. తెలంగాణ మోడల్ దేశమంతటా ప్రభావం చూపుతుందని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే తుక్కుగూడ సభ నుంచే లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జన జాతర సభను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏఐసీసీ ఆదేశాలు, రేవంత్‌‌‌‌‌‌‌‌ సూచన మేరకు పార్టీ ముఖ్య నాయకులంతా ఏకమై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకొని సభ సక్సెస్​కు భారీగా ఏర్పాట్లు చేశారు. సుమారు 60 ఎకరాల్లో సభ జరగనుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 300 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం అలాట్ చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పది వేలు, ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి లక్ష మంది చొప్పున కనీసం పది లక్షల మందిని సభకు తరలించేందుకు బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉన్నందున సభకు వచ్చేవాళ్లందరికీ మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

జనజాతర సభను విజయవంతం చేయాలి :  మున్షీ

తుక్కుగూడలో కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌ గాంధీ హాజరుకాబోయే జనజాతర సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్‌‌‌‌ మున్షీ పిలుపు నిచ్చారు. శుక్రవారం మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌‌‌‌ వెంకటస్వామి, ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ మహేశ్ కుమార్‌‌‌‌ గౌడ్​తో కలిసి సభ ఏర్పాట్లను దీపాదాస్ పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందన గుర్తుచేశారు. తెలంగాణ  ఇచ్చిన సోనియా గాంధీని ఇక్కడి ప్రజలు నమ్మి.. కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి అండగా నిలబడి అధికారం కట్టబెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని తెలిపారు. తుక్కుగూడ మైదానాన్ని అదృష్టంగా భావిస్తూ.. ఇదే వేదికగా శనివారం రాహుల్‌‌‌‌ గాంధీ 2024 లోక్​సభ ఎన్నికలపై కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆమె వెల్లడించారు. మోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెడుతారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ పార్టీకీ వెన్నుదన్నుగా నిలవాలని ఆమె కోరారు. 

భారీగా తరలిరావాలి :  మంత్రులు

తుక్కుగూడ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నామని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహించిన సభ కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. కేంద్రంలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేశవ్యాప్తంగా ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తుక్కుగూడ జన జాతర సభకు బూత్ స్థాయి కార్యకర్తలంతా సభకు తరలి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ కోరారు. కాంగ్రెస్​ విజయ కేతనం తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు కొనసాగాలని మంత్రి పిలుపునిచ్చారు. మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అని మంత్రి సీతక్క అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి బీఆర్ఎస్​ను తుక్కుతుక్కుగా ఓడించి.. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై భరోసాతో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నామన్నారు.   ప్రజలు జన జాతర సభకు తరలివచ్చి కాంగ్రెస్‌‌‌‌ పార్టీని దీవించాలని కోరారు. తుక్కుగూడకు మహత్యం ఉందని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 4నెలల క్రితం ఇక్కడే సభ నిర్వహించి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. సీఎం సలహాదారు వేంనరేందర్‌‌‌‌రెడ్డి, మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి,  బడంగ్‌‌‌‌పేట్‌‌‌‌ మేయర్‌‌‌‌ పారిజాత నర్సింహారెడ్డి, ఆరేపల్లి మోహన్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి 23 ప్రత్యేక హామీలు

కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభ వేదికగా శనివారం ఏఐసీసీ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తర్వాత తెలంగాణకు ప్రత్యేకంగా ‘‘ఫైవ్ జస్టిస్, స్పెషల్ ప్రామిసెస్ టూ తెలంగాణ” పేరుతో 23  ప్రత్యేక హామీలను అనౌన్స్ చేయనున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు భద్రాచలం ముంపు మండలాలైన ఎటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలుపుతామని పార్టీ హామీ ఇవ్వనున్నది.

అదే విధంగా హైదరాబాద్ లో ఐటీఐఆర్, ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టంలోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ లో ఐఐఎం, మైనింగ్ యూనివర్సిటీ వంటి హామీలు ఉన్నాయి. ఏఐసీసీ మేనిఫెస్టో తర్వాత రాష్ట్రానికి పాంచ్ న్యాయ్ పేరిట పార్టీ మరికొన్ని హామీలు రిలీజ్ చేయనున్నది. ఇందుకోసం వారం రోజుల పాటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు, కన్వీనర్ ప్రోఫెసర్ అల్దాస్ జానయ్య, మెంబర్లు డాక్టర్ రియాజ్, ఏ శ్యామ్ మోహన్, బి కమలాకర్ రావు, వినోద్ కుమార్, జనక్ ప్రసాద్, లింగం యాదవ్, కప్పర హరిప్రసాద్ కసరత్తు చేసి తెలంగాణకు అవసరమైన అంశాలను ఎంపిక చేశారు.