నేడు బూత్ లెవెల్‌‌ ఏజెంట్లతో కాంగ్రెస్ మీటింగ్

నేడు బూత్ లెవెల్‌‌ ఏజెంట్లతో కాంగ్రెస్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌‌ఏ) మీటింగ్‌‌కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌‌సభ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నాయకులకు ఖర్గే, సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు.. బీఎల్‌‌ఏలతో పాటు పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పీసీసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా కార్యకర్తలందరికీ ఇన్విటేషన్లను పంపించారు. అందరూ సమావేశానికి విధిగా హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 43 వేల మంది బీఎల్‌‌ఏలు ఉన్నారు. వారితో పాటు నేతలు, కార్యకర్తలంతా కలిసి దాదాపు లక్ష మంది దాకా సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.