అవమానించడం బీఆర్ఎస్​ లక్షణం : బీర్ల ఐలయ్య

అవమానించడం బీఆర్ఎస్​ లక్షణం :  బీర్ల ఐలయ్య

హైదరాబాద్/యాదాద్రి(ఆలేరు), వెలుగు: అవమానించడం బీఆర్ఎస్​లక్షణమని, అందరినీ గౌరవించడం కాంగ్రెస్​ లక్షణమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సీఎం రేవంత్, మంత్రులు సోమవారం యాదాద్రికి వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కూర్చున్న కుర్చీలు ఎత్తు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేతప్ప అక్కడ ఎవరినీ అవమానించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ చిన్న విషయాన్ని పట్టుకొని అవమానించినట్టు సోషల్​ మీడియాలో బీఆర్ఎస్​ నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలని హితువు పలికారు. బ్రహ్మోత్సవాల్లో అందరినీ గౌరవించుకున్నామని తెలిపారు. వారం రోజుల్లో రివ్యూ నిర్వహించుకొని నిధులు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఐలయ్య తెలిపారు.  

గొల్ల కురుమలను బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలే

బీఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమలకు అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ ఐలయ్య ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. గొల్ల కురుమలకు గొర్లు ఇచ్చి.. వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ పాలనలో జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. గొల్ల కురుమలకు విద్య, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించి.. వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తోడ్పాటు అందిస్తామన్నారు.