మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ వార్డ్ మెంబర్లుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. నేటి నుంచి నామినేషన్లు మొదలుకానున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు ఆఫీసులో మొగుళ్లపల్లి మండలంలోని 26 గ్రామాలకు చెందిన కాంగ్రెస్ లీడర్లతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఆయా గ్రామాల రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహులు నామినేషన్లు వేసుకోవచ్చని సూచించారు. ఆ తర్వాత నామినేషన్ వేసిన అభ్యర్థుల గెలుపుపై మొగుళ్లపల్లి మండలంలోని ఎనిమిది మంది సీనియర్ లీడర్లతో కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని వారిచ్చే నివేదిక ఆధారంగా గెలిచే అభ్యర్థులకు పార్టీ తరఫున మద్దతు ఇవ్వనున్నారు. అప్పటివరకు గ్రామాల్లో పాత కొత్త తేడా లేకుండా పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ ఎలాంటి గొడవలకు తావు లేకుండా సమన్వయంతో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
