రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తన నియోజకవర్గంలో ఉంటుందన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందన్నారు. అయితే ఓఆర్ఆర్ మీదుగా పాదయాత్ర చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. శంషాబాద్ ,రాజేంద్రనగర్ , మెహాదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లి ,సంగారెడ్డి మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండేలా చూడాలని పీసీసీని కోరుతానన్నారు. పాదయాత్రలో ప్రధానంగా రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకునేలా ప్లాన్ చేస్తామన్నారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ఏం విమర్శించాలో తెలియక.. టీ షర్ట్ లపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్,డీజిల్ ధరలు , ప్రభుత్వ సంస్థల అమ్మకాల గురించి రాహుల్ గాంధీ అడిగే ప్రశ్న లకు సమాధానం చెప్పకుండా .. బీజేపీ టీ షర్ట్ ల రాజకీయం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ పూటకో డ్రెస్ మారుస్తాడని.. మూడు పూటలకు 60 లక్షల ఖరీదు డ్రెస్ లు వేసే మోడీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదన్నారు. మోడీ ధరించే 60 లక్షల డ్రెస్ ఎక్కడ.. ,రాహుల్ గాంధీ ధరించే 40 వేల టీ షర్ట్ ఎక్కడా అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
