నెహ్రు, మోడీ ఇద్దరూ కరెక్టే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

నెహ్రు, మోడీ ఇద్దరూ కరెక్టే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్: పాకిస్థాన్ నుండి కాశ్మీర్ ను కాపాడడం కోసమే అప్పటి ప్రధాని నెహ్రు ఆర్టికల్  370,35a ను తీసుకొచ్చారన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  మంగళవారంలో సీఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ లో  జరిగిన ఆర్టికల్ 370 రద్దు చర్చలో మోడీ, అమిత్ షా  నెహ్రుపై అనవసర ఆరోపణలు చేశారన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశంలో 540 సంస్థానాలు ఉండేవని, అందులో హైదరాబాద్ నిజాం పాలనలో కాశ్మీర్ జునగర్ అధీనంలో ఉండేదని జగ్గారెడ్డి అన్నారు.అప్పటి హైదరాబాద్ నిజాం నవాబ్… హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం కావడానికి ఒప్పుకోలేదని,కానీ ప్రజలు మాత్రం భారతదేశం లో కలవడానికి ఒప్పుకున్నారన్నారు. కాని కశ్మీర్ విషయంలో కశ్మీర్ లో రాజు ఒప్పుకున్నా.. అక్కడ ప్రజలు  ఒప్పుకోలేదన్నారు.  హైదరాబాద్ లో నిజాం ఒక్కడే ఒప్పుకోలేదు కాబట్టి సర్దార్ పటేల్  అతన్ని ఒప్పించాడని ఆయన అన్నారు.  కశ్మీర్ ప్రజలు మాత్రం తమ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో కలవడానికి ఇష్టపడ్డారని జగ్గారెడ్డి తెలిపారు.

పాకిస్థాన్ నుండి కాశ్మీర్ ను కాపాడడం కోసమే అప్పటి ప్రధాని నెహ్రు ఆర్టికల్  370,35a ను తీసుకు వచ్చారని, ఒక వేళ 370,35a లేకపోతే ప్రస్తుతం ఇబ్బంది పడే వాళ్ళమని ఆయన అన్నారు.  అప్పుడు ఏమి జరిగింది అనేది  ఇప్పుడు ఉన్న వాళ్లకు తెలియదని, అప్పుడు పాకిస్థాన్ వాళ్ళు కాశ్మీర్ ను ఆక్రమించుకొని ఉంటే ఇప్పుడు కాశ్మీర్ నుండి దేశానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవని అన్నారు.అప్పుడు  మోడీ, అమిత్ షా ఉన్న కూడా వాళ్ళు కూడా అదే నిర్ణయం(ఆర్టికల్)  తీసుకునే వాళ్లని జగ్గారెడ్డి తెలిపారు.

కాశ్మీర్ లో ఆర్టికల్  370,35a తీసివేయాలని  ఆర్ఎస్ఎస్ ముందు నుండి అనుకుందని, ఆర్ఎస్ఎస్ ఆలోచన తోనే బీజేపీ 370 ఆర్టికల్ ను రద్దు చేసిందని  జగ్గారెడ్డి అన్నారు.  మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం అని..  ఇప్పుడున్న పరిస్థితులకు  మోడీ, అమిత్ షా ఆర్టికల్ 370,35a రద్దు చేయడం కరెక్టేనని జగ్గారెడ్డి సమర్ధించారు. అప్పుడు నెహ్రు చేసింది.. ఇప్పుడు మోడీ అమిత్ షా చేసింది రెండు కరెక్టేనని ఆయన అన్నారు. కాశ్మీర్ ను కాపాడడం లో నెహ్రు కీలక పాత్ర పోషించారని, నెహ్రు ఆరోజు కాపాడాడు కాబట్టి ఈరోజు మోడీ ,అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడారని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ  అని, ఓట్ రాజకీయాలు ఎప్పుడు చేయదని, సీటు కోసం తన భావాలు ఎప్పుడు చంపుకోదని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ఒక్క మతానికి చెందిన పార్టీ అని అన్నారు. బీజేపీ హిందూజం పార్టీ..కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ.  ఈ రెండు పార్టీలూ దేశానికి అవసరమన్నారు.