ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఇవాళ మునుగోడు మండలంలో  కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అయితే హుజురాబాద్ లో 2 వేల కోట్లు దళితులకు ఇచ్చినట్లు మునుగోడులో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 10 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. మంత్రి ముందు నిరసన తెలుపుతామన్నారు. దీంతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు బయలు దేరిన రాజగోపాల్ రెడ్డిని బొంగులూరు గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.

అటు మునుగోడు నియోజకవర్గంలోని చిట్యాల, నార్కట్ పల్లి, నకిరేకల్, రామన్నపేట లో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. మొన్న చౌటుప్పల్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇవాళ కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉండటంతో... ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. 

కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ ను ఖండించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. ఈటలను ఓడగొట్టేందుకే దళిత బంధు అనే పథకాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి.