దశాబ్ది ఉత్సవాల పేరుతో శతాబ్దానికి సరిపడా దగా: ఎమ్మెల్యే సీతక్క

దశాబ్ది ఉత్సవాల పేరుతో శతాబ్దానికి సరిపడా దగా: ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల పేరిట బీఆర్ఎస్​ ప్రభుత్వం, కేసీఆర్ శతాబ్దానికి సరిపడా మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏ ఉత్సవాలైనా ఒక్క రోజు నిర్వహిస్తారని, ఇక్కడ మాత్రం దశాబ్ది ఉత్సవాల పేరిట 21 రోజులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉత్సవాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దశాబ్ది దగా పేరిట నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి కేసీఆర్​పై సీతక్క కంప్లయింట్​ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్​పై అందరూ చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలెన్నో అమలుకు నోచుకోలేదని, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 

రాష్ట్రానికి కేసీఆర్ రావణాసురుడిలా దాపురించారని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా రావణాసురుడిలాంటి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నామని రోహిన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు దశాబ్ద కాలంగా నెరవేర్చకుండా కేసీఆర్, బీఆర్ఎస్​ నేతలు మోసం చేస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. మొత్తం 75 హామీలు ఇచ్చారన్నారు. మేనిఫెస్టోలోని హామీలు ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక వెబ్​సైట్ నుంచి తొలగించిందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్​సైట్​లో మాత్రం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.