చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. దాదాపు 59 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమిళనాడు ప్రభుత్వంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భాగస్వామ్యం కాబోతుంది. ఇద్దరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే చీఫ్ విజయ్ మంత్రి వర్గంలో చేరబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుధవారం ( మే 20) కీలక ప్రకటన చేసింది.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు కేబినెట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు చేరబోతున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దాదాపు ఆరు దశాబ్దాల విరామం తర్వాత కాంగ్రెస్ తమిళనాడు మంత్రివర్గంలో చేరడం చారిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదించిన సంక్షేమ ఆధారిత పాలన దార్శనికతకు దోహదపడతారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీకల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ టీవీకే సాధించలేదు. దీంతో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు విజయ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి.
►ALSO READ | నటి ట్విషా శర్మ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం అవసరం లేదు: భోపాల్ కోర్టు కీలక తీర్పు
దీంతో అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో టీవీకే ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవడంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలకు విజయ్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారు. గతంలో అధికార డీఎంకే పార్టీకి కాంగ్రెస్ మద్దతుగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. దాదాపు దశాబ్ధాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కాబోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధాన రాజకీయ మార్పుగా పరిగణించబడుతోంది.
