
- గతంలో పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల
- జీవితాలతో ఆడుకున్నరు: బల్మూరి
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాయ మాటలు నమ్మి నిరుద్యోగులు ఆగం కావొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో పరీక్ష పేపర్లను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న కేటీఆర్.. మళ్లీ ఇప్పుడు వారి జీవితాలను ఆగం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
గ్రూప్ 1 పరీక్ష అంటే తెలియని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ఈ పరీక్షలపై విమర్శలు చేయడం విచారకరమన్నారు. నిత్యం అవాస్తవాలను ప్రచారం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. వాస్తవాలు ఏమైనా ఉంటే చట్టం, న్యాయపరంగా పోరాడి అభ్యర్థులకు న్యాయం చేస్తే తాము కూడా హర్షిస్తామని చెప్పారు. కేవలం రాజకీయ కుట్రతో రేవంత్ రెడ్డిపై బురదజల్లే ఉద్దేశంతో ఆరోపణలు చేయొద్దని సూచించారు.
పదేండ్ల పాటు విద్యార్థి నాయకుడిగా బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల పక్షాన పోరాడి జైలుకెళ్లిన తాను, వారి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. కేటీఆర్, కౌశిక్ రెడ్డి తమ రాజకీయ స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తే బీఆర్ఎస్‌పై తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.