ఆదిలాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడ్డ దొంగ అరెస్ట్ : ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్ జిల్లాలో  వరుస చోరీలకు పాల్పడ్డ దొంగ అరెస్ట్ : ఎస్పీ అఖిల్ మహాజన్
  •     11 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం
  •     జైలు నుంచి విడుదలైన రోజే స్కూటీ చోరీ

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడిన టెకం రామారావు అలియాస్​ తుకారాం అనే దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్​మహాజన్​ తెలిపారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. 

ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన 7  దొంగతనాల కేసుల్లో దర్యాప్తు చేపట్టగా మండలంలోని దంతన్​పల్లి పంచాయతీ నాగాపూర్​కు చెందిన తుకారాం పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిందితుడిపై మొత్తం 36 కేసులు ఉన్నాయని.. కరీంనగర్, సిద్దిపేట్ జిల్లాల్లో  దొంగతనాలు చేసినందుకు గతంలో రెండేండ్లపాటు జైలు శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదన్నారు. 

గత నెల 6న జైలు నుంచి విడుదలైన అనంతరం ఉట్నూర్ మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. విడుదలైన రోజే మంచిర్యాలలో స్కూటీ దొంగతనం చేసి ఉట్నూరుకు వచ్చి, ఊరు శివారులో పాడుబడ్డ ఇండ్లు, నిర్మాణంలో ఉన్న ఇండ్లలో ఉంటూ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ఇటీవల దొంగిలించిన బంగారం, వెండి ఆభరణాలతో మంచిర్యాల వైపు పారిపోతుండగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్‌‌‌‌ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.