స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రారంభం : కలెక్టర్‌‌ కుమార్‌‌ దీపక్‌‌

స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రారంభం : కలెక్టర్‌‌ కుమార్‌‌ దీపక్‌‌
  •     ట్రైనింగ్​ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌‌ కుమార్‌‌ దీపక్‌‌

నస్పూర్, వెలుగు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్​సెటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్​లో ఏర్పాటుచేసిన శిక్షణ సంస్థను గురువారం జోనల్ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు, కరీంన గర్ రీజనల్ హెడ్ అపర్ణ రెడ్డి, ఆర్ సెటీ సంచాలకుడు ఆశిష్ వార్లే, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతితో కలిసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచిర్యాల ప్రాంతంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నామని, కలెక్టరేట్​లోని టాస్క్ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి ఉపాధి  అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 

అడ్వాన్డ్స్​ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వృత్తి శిక్షణ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు రోబోటిక్, మిషనరీస్, ఎలక్ట్రికల్ ఇతర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని యువత స్వయం ఉపాధి పొందాలని సూచించారు. అనంతరం ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.2 లక్షల చెక్కు అందించారు.