లోపల భయం.. బయట ధీమా.. ఓట్ల లెక్కింపుపై అన్ని పార్టీల్లో అదే తీరు

లోపల భయం.. బయట ధీమా.. ఓట్ల లెక్కింపుపై అన్ని పార్టీల్లో అదే తీరు
  • రిజల్ట్స్​ వచ్చాక క్యాంప్​లకు అభ్యర్థుల తరలింపు
  • 16న వాపస్ వచ్చేలా ప్లానింగ్​  

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్‌‌‌‌లో నగరపాలక సంస్థతో పాటు బోధన్‌‌‌‌, ఆర్మూర్‌‌‌‌, భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. లోపల గెలుపు అంచనాలు వేసుకుంటూనే బయట ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు, రిబెల్స్‌‌‌‌ పోటీతో ఓట్ల చీలికపై ఆందోళన చెందుతున్నారు. 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌‌‌‌లో 30కి పైగా సీట్లు సాధించిన పార్టీ అధికారం చేపట్టనుండగా, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. మజ్లిస్‌‌‌‌ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉండడంతో ఫలితాలపై అన్ని పార్టీలూ లెక్కలు వేసుకుంటున్నాయి. స్పష్టమైన మెజారిటీ రాకపోతే మద్దతుల సమీకరణలు కీలకం కానున్నాయి.

మరోవైపు ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన అభ్యర్థులను క్యాంప్‌‌‌‌లకు తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తా ఇప్పటికే క్యాంప్‌‌‌‌నకు తరలించగా, ఇతర పార్టీలు కూడా అదే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. ప్రధాన పదవుల ఎన్నిక 16న జరగనున్న నేపథ్యంలో అప్పటివరకు క్యాంప్‌‌‌‌ రాజకీయాలు కొనసాగనున్నాయి. మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, మజ్లిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో స్థానిక నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.