ఆదిలాబాద్ జిల్లాలో లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణశాసనం

ఆదిలాబాద్ జిల్లాలో  లేబర్ కోడ్ లు కార్మిక వర్గానికి మరణశాసనం
  •     ఉమ్మడి జిల్లాలో గళమెత్తిన కార్మిక, ప్రజా సంఘాలు

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్/నేరడిగొండ/దహెగాం/తిర్యాణి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి మరణశాసనం లాంటివని, కొత్ల కోడ్​లను రద్దు చేయాలని ఉమ్మడి జిల్లాలోని కార్మిక సంఘాలు గళమెత్తాయి. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా నిర్మల్​లో టీయూసీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజన్న  మాట్లాడుతూ కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్​సోర్సింగ్, కాంట్రాక్టు వర్కర్స్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని, కార్మికులకు భద్రత కల్పించాలని కోరారు. టీయూసీఐ జిల్లా కోశాధికారి ఎండీ గఫూర్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కట్ట లక్ష్మి, టీయూసీఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

వెంటనే వెనక్కి తీసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఇటీవల విడుదల చేసిన నాలుగు లేబర్​కోడ్​లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్​ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు ఆదిలా బాద్​కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అంతకు ముందు సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్స్​గా నోటిఫికేషన్ జారీయడాన్ని ఖండించారు. 

ఐఎఫ్​టీయూ జిల్లా కార్యదర్శి వెంకట్, ఐఎన్​టీయూసీ జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఏఐకేఎస్​ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్, టాగ్స్​రాష్ట్ర కార్యదర్శి బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. నేరడిగొండలో ఏఐటీయూసీ మండల ప్రెసిడెంట్ పెరుమాండ్ల నర్సయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీ తీశారు. 

దహెగాంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తిర్యాణిలో డీవైఎఫ్ఐ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తిర్యాణిలోని కుమ్రం చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ర్యాలీ తీశారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టీకానంద్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ చట్టాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ ​చేశారు.