
జగిత్యాల: కొత్త రెవెన్యూ చట్టంపై టీఆర్ఎస్ నాయకుల సంబరాలు, ర్యాలీలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి మూలమని వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినందుకే సంబరాలా? అని ప్రశ్నించారు. బుధవారం జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులకు బోనస్ ఇచ్చి… శభాష్ అని చెప్పిన సీఎం కేసీఆర్.. రెవెన్యూ వ్యవస్థలో ఢొల్లతనం బయటకు రావడంతో వీఆర్వోలను బాధ్యులను చేశారన్నారు. వీఆర్వోలు దొంగలు, మిగతా వారంతా మంచివారేనన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. వీఆర్వోలు కేవలం ప్రాథమిక సమాచారం చేరవేస్తారని.. నిజానికి పెత్తనమంతా తహశీల్దార్లదేనని జీవన్ రెడ్డి అన్నారు. కోవిడ్ నుంచి సమాజాన్ని రక్షించాలన్న స్పృహ మరిచి టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు.
2017లో భూ ప్రక్షాళన పేరుతో రికార్డులు సవరిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ దాదాపు 15 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూముల్లో అనర్హులకు పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేశారని, అలాంటి వారి పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు.
LRS పేరుతో బడుగు జీవులపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోందన్న జీవన్ రెడ్డి.. ఉన్న భూమి విలువను పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆపరేషన్ చేసే ముందు మత్తు మందులాగా టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేస్తున్నారని, రెండు మూడు నెలల్లో ప్రజలకు అసలు నిజం తెలుస్తుందని అన్నారు