చీటింగ్​ పేటెంట్ ​కేసీఆర్‌‌కే ఉంటది.. ఆయనే ఒక 420 : జీవన్​రెడ్డి

చీటింగ్​ పేటెంట్ ​కేసీఆర్‌‌కే ఉంటది.. ఆయనే ఒక 420 : జీవన్​రెడ్డి

కోరుట్ల, వెలుగు : 2014, 18 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని మాజీ సీఎం కేసీఆరే ఒక 420 అని, చీటింగ్ పేటెంట్ రైట్స్​ ఆయనకే దక్కుతాయని ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా  కోరుట్లలోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావుతో కలిసి మాట్లాడారు. కేసీఆర్​తెలంగాణ ఖజానాను ఖాళీ చేశాడన్నారు. ఆయన పదేండ్ల పాలనలో కనీసం రేషన్​కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారని స్పష్టం చేశారు. 

2018 ఎన్నికలకు ముందు నాటి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించిన​ సదర్‌‌మాట్ బ్యారేజీ ఇంత వరకు కొలిక్కి రాలేదన్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌‌రావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని, అంతకుమించి  బీఆర్ఎస్ ​హయాంలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు. ఆయన హయాంలోనే  కోరుట్లలో పశు వైద్య కాలేజీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నిరుద్యోగ యువత కోసం త్వరలో  మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ​ఇవ్వనున్నారని చెప్పారు. జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్లలోని వెటర్నరీ కాలేజీకి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్​రావు పేరు పెట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జీవన్​రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కేక్​కట్​చేయించారు. 

కాంగ్రెస్‌లో చేరిన మున్సిపల్​ వైస్​ చైర్మన్‌, కౌన్సిలర్​

బీఆర్ఎస్‌కు చెందిన కోరుట్ల మున్సిపల్​ వైస్​చైర్మన్ ​గడ్డమీద పవన్, ఎనిమిది మంది కౌన్సిలర్లు శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నాగభూషణం,  వెంకటేశ్‌​, కమల, మధు,  లింగం, అబ్దుల్​ రహీం, వేణు, రియాజ్​ చేరిన వారిలో ఉన్నారు.