మా ఎమ్మెల్యేకు కూడా నాలాగే అనిపిస్తోంది.. కానీ మాట్లాడలేరు

V6 Velugu Posted on Jan 01, 2022

స్థానికతను పట్టించుకోకుండా... సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్వంలో జగిత్యాలలో నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా.. ఇదే కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఒకే వేదికపై ప్రతిపక్ష, పాలక పక్ష నేతలుండటంతో కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 317తో ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 

‘నాలాగే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా భావిస్తుంటారు.. కాకపోతే ఆయన ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేరు. కావాలంటే ఎమ్మెల్యే ప్రభుత్వానికి నేరుగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేతగా నేను స్వేచ్ఛగా మాట్లాడొచ్చు.. కాబట్టి నేను బహిరంగంగా చెబుతున్నా. సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల బదిలీలు చేయడం సరికాదు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే స్థానికత అంశం ప్రాతిపదికన. 1969 ఉద్యమమైనా, మలిదశలో కేసీఆర్ చేసిన ఉద్యమమైనా హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం ఆధారంగానే సాగింది. 1975లోనే ఇలాంటి సమస్యకు పరిష్కారం కావాలని స్థానికతకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం జోనల్ విధానాన్ని తెచ్చింది. స్థానికతను పరిగణలోకి తీసుకుని సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ప్రస్తుతం చేపట్టిన బదిలీల విధానంతో ఎదురయ్యే సమస్యలు సీఎంకు అధికారులు వివరించడంలో విఫలమయ్యారు. ప్రస్తుత బదిలీ విధానంలో విడోలు, ఒంటరి మహిళలు, పెళ్లికాని యువతులకు సంబంధించిన విషయాలు పరిగణనలోకి తీసుకోలేదు. ఒక్కసారి బదిలీ అయిపోయి వేరే జోన్ లోకి వెళ్తే.. జీవితంలో మళ్లీ సొంత జిల్లాకు రాలేరు. అందుకే ఈ గొడవంతా జరుగుతోంది. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర. నిరుపేదలకు బోధన అందించే సర్కారు స్కూళ్ల ఉపాధ్యాయులకు మరింత బాధ్యత ఉంటుంది. సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. అందులో భాగంగానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కేటాయించే నిధుల్లో 40 శాతం స్కూళ్ల అభివృద్ధికి వెచ్చించాల్సి ఉంటుంది. స్కూళ్లలో టీచర్ల ఖాళీలుండటం వల్లే విద్యావాలంటీర్లున్నారు. కరోనా వల్ల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య కూడా పెంచాలి. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విద్యా, వైద్యంపై ఫోకస్ పెట్టినందువల్లే ఆయన సీఎంగా సక్సెస్ అవుతున్నారు. ఢిల్లీ బడ్జెట్ లో ఎక్కువ శాతం విద్య, వైద్యంపైనే ఖర్చు చేస్తున్నారు. నిజానికి కేజ్రీవాల్ గ్లామర్ ఉన్న సీఎం కాకపోయినా... ఆయన పనితీరు, విధానాల వల్లే సక్సెస్ అవుతున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకు భారంగా మారిన విద్య, వైద్యాన్ని పట్టించుకోవాలి’ అని జీవన్ రెడ్డి అన్నారు.

For More News..

హైదరాబాద్ కోసం కేంద్రానికి సహకరిస్తాం

రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు 

Tagged Telangana, MLC Jeevan Reddy, Congress, CM KCR, jagityal, MLA Sanjay Kumar, Teachers transfers

Latest Videos

Subscribe Now

More News