మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే టికెట్లివ్వాలె

మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే టికెట్లివ్వాలె

యాదాద్రి భువనగిరి: తాను పార్టీలో చురుగ్గానే ఉన్నానని, ఏమాత్రం అసంతృప్తితో లేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తన నివాసంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..పార్టీలో కష్ట నష్టాలకు ఓర్చి పని చేస్తున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకి టికెట్ కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఇక పీఏసీ సమావేశానికి తాను రాలేనని ముందే చెప్పానని, అయినా 29 మందితో పీఏసీ వేయడమేంటని ప్రశ్నించారు. నలుగురు సభ్యులతో పీఏసీ ఏర్పాటు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. డాక్టర్ రవి చేరిక చెల్లకపోతే బీల్యా నాయక్ చేరిక ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. నైని కోల్ మైన్ టెండర్లను రద్దుకు కృషి చేసింది తానేనని, తన పోరాటం వల్లే సింగరేణికి 20 వేల నుండి 30 వేల కోట్ల ఆదాయం మిగిలిందన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రెటరీ బోసు రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. 

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే విషయంపై మాణిక్కం ఠాగూర్ తో చర్చించామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని చెప్పానని అన్నారు. 100శాతం ముందే అభ్యర్థులను ఖరారు చేయాలన్నారు. సిరిసిల్ల మీటింగ్ పై డిస్కర్షన్ జరిగిందన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి తాను పని చేస్తున్నానని చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ గా తన పని తాను చేస్తున్నానని, ఎంపీగా తన నియోజకవర్గంలో బిజీగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ లోకి మంచి వారిని చేర్చుకోవాలని, షర్మిల పార్టీ గురించి చర్చించలేదన్నారు. డీసీసీ కమిటీల మార్పు ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుండి 90 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకురావాలని మాణిక్కం ఠాగూర్ ను కోరినట్లు చెప్పారు. 

కాంగ్రెస్ లోకి త్వరలో మరిన్ని చేరికలు
ఎంపీ కోమటిరెడ్డితో మిషన్ 2023పై చర్చించాం 
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ వెల్లడి

కాంగ్రెస్ లోకి త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పారు. రాష్ట్రంలో తాము 70 నుంచి 80 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సహచర ఎంపీ అని, ఆయన తనను లంచ్ కు ఆహ్వానిస్తే వెళ్లానని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ అంశాలపై కలిసి చర్చించామన్నారు. ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరే అంశంపైనా మాట్లాడామన్నారు. మిషన్ 2023పై చర్చించామన్నారు.