24 గంటల కరెంట్​ ఇస్తున్నట్టు నిరూపించాలె: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

24 గంటల కరెంట్​ ఇస్తున్నట్టు నిరూపించాలె: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు కేటీఆర్​ నిరూపించాలని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సవాల్​విసిరారు. సబ్​స్టేషన్లలో లాగ్​ బుక్కులు తీసుకొచ్చి చూపించాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అవసరమైన తాను కరెంట్​తీగలనైనా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆలేరు నియోజక వర్గానికి చెందిన పలువురు బీఆర్​ఎస్​ నాయకులు.. హైదరాబాద్​లోని కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి నివాసంలో కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకున్నారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గృహలక్ష్మి ఇస్తానన్న కేసీఆర్​.. దాన్ని గాలికి వదిలేశారన్నారు. కేసీఆర్​ ప్రకటించిన పథకాలన్నీ బీఆర్​ఎస్​ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అందరికీ ఉపయోగపడే పథకాలని చెప్పారు. డబ్బుల విషయంలో కాంగ్రెస్​ పోటీ పడలేదని, కానీ, పథకాల్లో మాత్రం పోటీ పడుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలు అమలు కాకుంటే.. తన పదవులన్నింటికీ రాజీనామా చేస్తానన్నారు.  మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామని తెలిపారు. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్​ టికెట్లు ఖరారవుతాయన్నారు. యాదగిరిగుట్ట నుంచే తాను ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు.  ఆలేరుకు ఎమ్మెల్యే కన్నా తానే ఎక్కువ సార్లు వచ్చానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు నిజమని, ఇప్పటికీ బీఆర్​ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆయన అన్నారు. కేసీఆర్​ బండారాన్ని మోదీ బయటపెట్టారన్నారు.