
హైదరాబాద్, వెలుగు : యువత, ఉద్యోగుల పోరాటం, బలిదానాలను చూసి పార్లమెంట్లో సోనియా గాంధీ తెలంగాణ బిల్లు పెట్టారని, కానీ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లవుతున్నా ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా అవినీతే ఉందన్నారు. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, సెక్రటేరియెట్ సహా అన్నింట్లోనూ కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెరవేర్చలేదని ఫైరయ్యారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అయితే.. ఎంఐఎం బీ ప్లస్ టీం అని ఆరోపించారు.
బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు
అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తూ వచ్చిందని మనీశ్ తివారీ చెప్పారు. నోట్ల రద్దు, వ్యవసాయ చట్టాలను అన్ని పార్టీలు వ్యతిరేకించినా బీఆర్ఎస్ మాత్రం సమర్థించిందన్నారు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసేలా ఆర్టికల్370ని రద్దు చేసినా మద్దతిచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పూర్తిగా కుటుంబ పాలన నడుస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.లక్షా అరవై వేల అప్పును కేసీఆర్ మోపారన్నారు. మిగులు బడ్జెట్రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు.
రాష్ట్రాన్ని ఇంతలా దిగజార్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మనసుల్లో ఉన్న విషయాలనే రేవంత్ చెప్తున్నారని, వారికి ఓ మీడియంలా రేవంత్ ఉన్నారని చెప్పారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కానే కాదన్నారు. కులగణనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఎన్నికలయ్యాక చర్చిస్తామని మనీశ్ తివారీ స్పష్టం చేశారు.