
భారతదేశ ఆర్థిక వ్యవస్థను విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం (ఈనెల 18వ తేదీన) ట్వీట్ చేశారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థను పోలుస్తూ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకేలా కనిపిస్తున్నాయని విమర్శించారు. నిరుద్యోగం, చమురు ఉత్పత్తులు, మత కలహాల విషయంలో శ్రీలంక పరిస్థితి, భారత్ పరిస్థితి ఒకే రకంగా ఉందని ట్వీట్ చేశారు.
ప్రజల దృష్టిని మార్చినంత మాత్రాన వాస్తవాలను కనుమరుగు చేయలేరని రాహుల్ గాంధీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ శ్రీలంక మాదిరిలా ఉందంటూ గ్రాపులతో సహా ట్వీట్టర్ లో పేర్కొన్నారు. ఇరు దేశాల్లో కూడా 2017 నుంచి నిరుద్యోగం పెరిగిపోయిందని, 2020 నాటికి గరిష్ఠ స్థాయికి పెరిగిందని రాహుల్ ఈ గ్రాఫ్‌లో చూపించారు. ఇక పెట్రో ధరలను కూడా గ్రాఫ్‌లో చూపించారు. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన డేటా ఆధారంగా ఈ గ్రాఫ్‌లను రూపొందించినట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ మరింత దిగజారుతున్నాయి. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ దొరక్క అల్లాడుతున్న జనం వంట చేసుకునేందుకు కిరోసిన్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయని, పెట్రోల్ కొనేందుకు తమ వద్ద డబ్బుల్లేవని లంక సర్కార్ చేతులెత్తేసింది. ప్రజలు.. పెట్రోల్ కోసం బంకుల వద్దకు రావద్దొని తెలిపింది. దీంతో ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Distracting people won’t change the facts. India looks a lot like Sri Lanka. pic.twitter.com/q1dptUyZvM
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2022
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. ఆయనపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వీగిపోయింది. తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) ఎంపీ సుమంథిరన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేశారు. అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేయడంతో తీర్మానం వీగిపోయింది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైన గొటబయ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామం అధ్యక్షుడికి ఉపశమనం కలిగించినట్లయ్యింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘె బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంక పార్లమెంటు తొలిసారి సమావేశమైంది.
ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఇటీవల చోటు చేసుకున్న ఆందోళనలు హింసకు దారితీశాయి. దీంతో ప్రధానమంత్రిగా ఉన్న మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రణిల్ విక్రమసింఘె బాధ్యతలు స్వీకరించారు. దేశాన్ని రక్షించడమే తన కర్తవ్యమన్న ఆయన కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
మరిన్ని వార్తల కోసం..
ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు
ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె