ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె

హైదరాబాద్: ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి  హాజరైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ... సబ్బండ వర్గాలు సాధించుకున్న రాష్ట్రంలో... వాళ్లకే చట్ట సభల్లో  ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ఎస్సీ కులాల ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేమీలేదన్న ఆయన... వాళ్లను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర తొలి సీఎంగా దళితుడే ఉంటాడని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, మూడెకరాల భూమి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడే కేసీఆర్ నిజస్వరూపం బయటపడిందని... అలాంటి వ్యక్తి వెనకబడ్డ వర్గాలకు మంచి చేస్తారనుకోవడం భ్రమ అన్నారు. నూటికి 85 శాతం ఉండే సబ్బండ వర్గాలను కేసీఆర్ మోసం చేశారని... వాళ్లను రాజకీయంగా ఎదగకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని ఆరోపించారు. ఒక్క శాతం ఉన్నవాళ్లు రాజ్యమేలుతోంటే మిగతావాళ్లు వాళ్ల పాలనలో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఉప కులాలకు ప్రభుత్వం చేసిందేమీలేదని, ఇక చట్ట సభల్లో వాళ్ల ప్రాతినిధ్యం శూన్యమన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఉపకులాలకు కనీసం ఒక్క రాజ్య సభ సీటైనా కేటాయించాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.  ఎన్నికలప్పుడు తప్ప కేసీఆర్ కు దళితులు గుర్తుకు రారని... హుజురాబాద్ ఎన్నికలు కాగానే దళిత ఆఫీసర్ రాహుల్ బొజ్జాను సీఎంవో నుంచి బదిలీ చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం...

దశలవారీగా దళితబంధు అమలు చేస్తాం

వివాదంగా మారిన గుడిసెల తొలగింపు