నిర్వహణ లోపం వల్లే హత్రాస్ ఘటన.. దీన్ని రాజకీయం చేయదల్చుకోలేదు : రాహుల్​

నిర్వహణ లోపం వల్లే హత్రాస్ ఘటన.. దీన్ని రాజకీయం చేయదల్చుకోలేదు : రాహుల్​

అలీగఢ్: హత్రాస్​ తొక్కిసలాట పెను దుర్ఘటన అని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ అన్నారు. అధికార యంత్రాంగం వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణమని చెప్పారు. భోలే బాబా సత్సంగ్​కు వేలాది మంది భక్తులు వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదని అన్నారు. అయితే, దీనిని తాము రాజకీయం చేయదల్చుకోలేదని, బాధితులందరికీ న్యాయం జరగాలని అన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. శుక్రవారం ఉదయం రాహుల్​గాంధీ  ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో ఉత్తర ప్రదేశ్​లోని అలీగఢ్‌‌‌‌‌‌‌‌ కు చేరుకున్నారు. 

అక్కడ బాధితుల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం హత్రాస్​ చేరుకొని అక్కడి బాధితులను ఓదార్చారు. బాధితుల కుటుంబ సభ్యులు రాహుల్‌‌‌‌‌‌‌‌తో తమ ఆవేదన చెప్పుకున్నారు. కొందరు ఆయనను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరితోనూ మాట్లాడిన రాహుల్ వాళ్లకు ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా చొరవ చూపించి, ఈ పేద కుటుంబాలకు సాయం అందించాలని కోరారు. యూపీ సర్కారు నుంచి సహాయం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

పార్లమెంట్​లో ఈ అంశాన్ని లేవనెత్తుతా..

బాధితులను పరామర్శించిన అనంతరం రాహుల్​గాంధీ మీడియాతో మాట్లాడారు. “నేను రాజకీయ కోణంనుంచి మాట్లాడదలుచుకోలేదు. కానీ పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి. తప్పులు ఉన్నాయి. వాటిని గుర్తించాలి” అని యోగి సర్కారుకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పార్లమెంట్​లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్​గాంధీ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని చెప్పారు. 

సత్సంగ్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని వారు తనతో చెప్పారని అన్నారు. వారంతా విచారంలో, షాక్​లో ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే ఎంత వీలైతే అంత ఎక్కువ పరిహారం చెల్లించాలని యూపీ సర్కారును డిమాండ్​ చేశారు. బాధితులంతా నిరుపేదలని, పరిహారం ఆలస్యం చేయడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని రాహుల్ గాంధీ చెప్పారు.