టీఆర్ఎస్ , బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి

టీఆర్ఎస్ , బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపి టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నీటి ప్రాజెక్టుల పట్ల రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. లక్షా 20 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ టూరిస్ట్ స్పాట్ గా మారిందని..ఇరిగేషన్ కు ఉపయోగపడిన దాఖలాలు లేవని చెప్పారు. క్లౌడ్ బరస్ట్ వల్ల కాళేశ్వరం మునిగిందని  సిల్లీ కామెంట్లు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని ప్రధానికి తెలిసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

తుమ్మడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును వేరేచోట నిర్మించడం వల్ల అదిలాబాద్ కు నష్టం వాటిల్లుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మడిహట్టి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో స్టే తీసుకువస్తామన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులెటర్ పై మరో 4 టీఎంసీల నీరు ఏపీ తీసుకుంటున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ కు వస్తున్న 7 టీఎంసిల నీరు ఏపీ సర్కార్..అక్రమ ప్రాజెక్టుల ద్వారా తీసుకెళ్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

తెలంగాణ నీటి వనరులను కాపాడటానికి బీజేపీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో టీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ కు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పూర్తైతే నాగార్జున సాగర్ ఎండిపోతుందన్నారు. కేంద్రం అవినీతి ప్రాజెక్టులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే కాంగ్రెస్  మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.