ప్రధానితో రాజకీయ అంశాలపై చర్చ జరగలేదు:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రధానితో రాజకీయ అంశాలపై చర్చ జరగలేదు:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పార్లమెంట్​లోని పీఎం ఆఫీసులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలు, మెట్రో విస్తరణ, రోడ్ల అభివృద్ధి, చేనేతల సమస్యలపై చర్చించి పలు వినతిపత్రాలు సమర్పించారు. తర్వాత ఎంపీ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. భువనగిరి పట్టణానికి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్​ కింద బ్లాక్ లెవల్ క్లస్టర్ మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. 18 ఏండ్ల నుంచి 70 ఏండ్లలోపు వయసున్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్​ల పరిధిలోకి తీసుకురావాలని అడిగినట్లు తెలిపారు. చేనేత కార్మికులకు కొత్త టెక్నాలజీ, డిజైన్ల అభివృద్ధి, ట్రెండ్​లకు అనుగుణంగా మోడర్న్​ మెషీన్లు సమకూర్చాలని విజ్ఞప్తి చేశానన్నారు. అలాగే హెచ్‌‌ఎస్‌‌ఎస్ స్కీమ్​ కింద కనీసం 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ప్రధాని దృష్టికి పంట నష్టం..

ఇటీవల అకాల వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టంపై ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని.. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు కేంద్రం తరఫున ఓ టీమ్​ను పంపుతామని చెప్పారని వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘హైదరాబాద్–-విజయవాడ నేషనల్ హైవేని ఆరు లేన్ల రోడ్డుగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ హైవే వెంబడి సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ట్రైన్ వేస్తామని విభజన చట్టంలో పొందుపరిచారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరించాలి. ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టును ఘట్​కేసర్ నుంచి ఆలేరు, జనగామ వరకు విస్తరించాలి. పీఎం గ్రామీణ్ సడక్ యోజన కింద జనగామ, నల్గొండ, రంగారెడ్డి, భువనగిరి జిల్లాల రోడ్లను అభివృద్ధి చేయాలి” అని మోడీని కోరానన్నారు. ప్రధానితో రాజకీయ అంశాలపై చర్చ జరగలేదని, ఎంపీగా తన నియోజక వర్గంలోని అంశాలను మాత్రమే ఆయనతో చర్చించానని తెలిపారు.