- కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి తెలంగాణ గళం వినిపిస్తాం: ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి గళం విప్పుతామని ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ మల్లు రవి నేతృత్వంలో గడ్డం వంశీకృష్ణ, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఇతర ఎంపీలతో కలిసి పార్లమెంట్ లోపల, బయటన ఆందోళన చేపడతామన్నారు.
వీటితో పాటు దేశంలో కీలక అంశాలపై ఎన్డీయే సర్కార్ ను ప్రశ్నించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో లోపాలు, రాజకీయ జోక్యం, పెరుగుతున్న నిరుద్యోగం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో విపరీత కాలుష్యం, ఇటీవల ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్, నేషనల్ హెరాల్డ్ కేసు వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతామన్నారు.
ఇండియా-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇండియా-యూస్ ట్రేడ్ చర్చలు, చైనా సంబంధిత అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. అటామిక్ ఎనర్జీ బిల్ 2025, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రతిపాదనలు, చండీగఢ్ రాజ్యాంగ సవరణ బిల్లు మొదలైన వాటిపై పోరాటం చేస్తామన్నారు. కాగా, ఈసారి సమావేశాలు సోమవారం నుంచి మొదలై15 రోజులు మాత్రమే సాగనున్నాయి.
ఈ సెషన్ లో తెలంగాణ ప్రయోజనాలు, ప్రజా సమస్యలను అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి బలంగా వినిపించేందుకు కాంగ్రెస్ ఎంపీలంతా సిద్ధమయ్యారు. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్, మూసీ పునరుద్ధరణ, పట్టణ స్థానిక సంస్థలకు అర్బన్ చాలెంజ్ ఫండ్ వంటి అంశాల సాధనలో కేంద్రంపై ఒత్తిడి పెంచనున్నారు. అలాగే కొత్త రైల్వే మార్గాల ఆమోదాలు, వరంగల్, కొతగూడెం, పెదపల్లి విమానాశ్రయ అనుమతులు, రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక అనుమతులకు సంబంధించిన అంశాలపై డిమాండ్ చేయనున్నారు.
