
న్యూఢిల్లీ: 2004 నుంచి 2014 మధ్య దేశంపై పదేపదే ఉగ్రదాడులు జరిగినప్పటికీ పాకిస్తాన్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి, రాజ్యసభా పక్షనేత జేపీ నడ్డా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తున్నవారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రదాడుల తర్వాత ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో నడ్డా మాట్లాడారు. "పహల్గాం ఉగ్రదాడిని ఎన్డీఏ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఖండిస్తున్నది. దాడి జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకే కేంద్రమంత్రి అమిత్ షా కాశ్మీర్‌కు చేరుకున్నారు. ప్రధానమంత్రి కూడా తన సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని రిటర్న్ అయ్యారు. ఈ విషయాలే బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి, అవసరాన్ని బట్టి స్పందించే ప్రభుత్వానికి మధ్య తేడాను స్పష్టం చేస్తున్నాయి" అని నడ్డా పేర్కొన్నారు.