ఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ వీడింది. కేరళ సీఎం ఎవరనే విషయంలో దాదాపు పది రోజుల తర్వాత స్పష్టత వచ్చేసింది. కేరళ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత వీడీ సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
కేరళలో వీడీ సతీశన్ కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు. ఆరు సార్లు కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పేరు తెరపైకొచ్చినప్పటికీ వీడీ సతీశన్ వెనక్కి తగ్గకపోవడంతో కేరళ సీఎంగా వీడీ సతీశన్నే కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
Congress names VD Satheesan as the Chief Minister of Keralam. pic.twitter.com/rwwSnPRkma
— ANI (@ANI) May 14, 2026
ఇస్తే సీఎం పదవి ఇవ్వండని, లేకపోతే ఏమీ వద్దని వీడీ సతీశన్ కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం పదవి తప్ప మరే ఇతర పదవిని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ కేరళ సీఎం పదవి వీడీ సతీశన్నే వరించింది. కేరళ సీఎం సీటును సతీశన్ పట్టుబట్టి సాధించుకున్నారు.
వీడీ సతీశన్ యూడీఎఫ్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఐదేండ్లుగా కేరళ అసెంబ్లీలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సమర్థవంతంగా పోరాడారు.
దశాబ్ద కాలం తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి పాలనాపగ్గాలు చేపట్టనుంది. 2023లో మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణానంతరం.. పార్టీ సమిష్టి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్‌ను వేధించిన గ్రూపు రాజకీయాలను ఈ ఎన్నికల్లో పార్టీ సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది.
మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో, UDF 102 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకుంది. ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలను గెలుచుకోవడం విశేషం. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా మలబార్ రీజియన్‌లో ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) తో కలిసి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది.
