- జగ్గారెడ్డి లేఖపై గీతారెడ్డి, రాజనర్సింహ సపోర్ట్
- మీడియాకు లీకులపై మాణిక్కం అసహనం
- అంతర్గత కుమ్ములాటలతో వీక్ అవుతున్నమన్న అంజన్ కుమార్, అజారుద్దీన్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) మీటింగ్ హాట్‌హాట్‌గా జరిగింది. బుధవారం జూమ్‌యాప్‌లో ఈ సమావేశం నాలుగు గంటల పాటు కొనసాగింది. దీనికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అధ్యక్షత వహించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల మధ్య పెరిగిన గ్యాప్‌పై చర్చ జరిగినట్లు తెలిసింది. పీసీసీ ప్రెసిడెంట్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు కార్నర్ చేసినట్లు సమాచారం. రేవంత్ తీరుపై జగ్గారెడ్డి ఏఐసీసీకి లెటర్ రాయడాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి సమర్థించారు. లేఖ రాయడంలో తప్పులేదని జగ్గారెడ్డికి మద్దతు పలికారు. జిల్లాలో జరిగే కార్యక్రమాలపై నేతలకు సమాచారం ఇవ్వకుంటే ఎట్ల అని అన్నారు. ఆమె మాటలను మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా సపోర్ట్ చేసినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో వీక్ అవుతున్నామని వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్, అజారుద్దీన్ అన్నట్లు సమాచారం.
నేతల మధ్య వివాదాలే సమస్య..
ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు విషయంలోనూ నేతల మధ్య నెలకొన్న వివాదాలే సమస్యగా మారినట్లు తేల్చారు. డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ ఇన్‌చార్జీలకు పడటం లేదని, దాంతో మెంబర్షిప్ డ్రైవ్ నత్తనడకన సాగుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీలో సమస్యలు వెంటనే పరిష్కరించుకోపోతే క్యాడర్ స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని మానిక్కం దృష్టికి తీసుకుపోయారు.
ఇట్లయితే అధికారంలోకి రావడం కష్టం : ఠాగూర్
క్రమశిక్షణ కమిటీ మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్పాల్సిందికాదని, అలా చెప్పడంతో విభేదాలు వస్తున్నాయని ఠాగూర్ అన్నట్లు తెలిసింది. సోనియా, రాహుల్ కు లెటర్ రాసినా పర్వాలేదని, కానీ లెటర్లను మీడియాకు ఎందుకు లీక్ చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇట్లయితే పార్టీని 2023లో అధికారంలోకి తీస్కరావడం కష్టమేనన్నట్లు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉధృతంగా చేస్తున్నదని రేవంత్ రెడ్డి మీటింగ్ దృష్టికి తెచ్చారు.
డిజిటల్ మెంబర్షిప్ పై మీటింగ్ వాయిదా
గాంధీభవన్‌లో నేడు (గురువారం) జరగాల్సిన నియోజక వర్గ డిజిటల్ మెంబర్షిప్ సమన్వయకర్తల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

