8 స్థానాల్లో ఎందుకు ఓడాం..? : కురియన్ కమిటీ పోస్టుమార్టం

8 స్థానాల్లో ఎందుకు ఓడాం..? : కురియన్ కమిటీ పోస్టుమార్టం
  • గాంధీభవన్ లో త్రిసభ్య కమిటీ ఆరా 

  • సెగ్మెంట్ల వారీగా వివరాల సేకరణ

  • సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి అభ్యర్థులతో భేటీ పూర్తి

  • ఓడిన సెగ్మెంట్లతో పాటు గెలిచిన వారితోనూ మీటింగ్

  • నియోజకవర్గాల వారీగా వన్ బై వన్ భేటీ  

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్టుమార్టం మొదలైంది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలుండగా కాంగ్రెస్ 8, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. పార్లమెంటు ఫలితాల్లో ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. 2024, జూలై 11వ తేదీ ఉదయం గాంధీ భవన్ చేరుకున్న కమిటీ నియోజకవర్గాల వారీగా విడివిడిగా అభ్యర్థులతో ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తోంది. కురియన్‌తో పాటు రకీబుల్‌ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు వరుస భేటీలు ఉండనున్నాయి. తొలుత సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఓటమికి గల కారణాలపై కమిటీ ఆరా తీసింది.

కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గాంధీభవన్ కు చేరుకొని కమిటీతో భేటీ అయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి సమీర్ ఉల్లాతో కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాట్లాడింది. మల్కాజ్ గిరి, చేవెళ్లలో ఓటమికి కారణాలపై అభ్యర్థులు సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిని అడిగి తెలుసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్యతోనూ కమిటీ మాట్లాడింది. విజయానికి దోహదపడ్డ అంశాలపై ఆమెతో చర్చించింది. ఇవాళ మెదక్, మహబూబ్ నగర్ అభ్యర్థులు నీలం మధు, వంశీచంద్ రెడ్డితోనూ కమిటీ మాట్లాడనుంది. 

మూడు రోజుల షెడ్యూల్ ఇది

కురియన్ కమిటీ.. కాంగ్రెస్‌ గెలుస్తుందనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఓటమికి కారణాలపై అభ్యర్థులతో భేటీ అయి ఆరా తీస్తుంది. రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలకు క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓటమికి కారణాలను అడిగి తెలుసుకుంటారు. మూడో రోజు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు కమిటీ సభ్యులు వెళ్లనున్నారు. ప్రధానంగా చేవెళ్ల, మల్కాజిగిరి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్‌ వంటి స్థానాల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై అధిష్ఠానం ఆరా తీస్తోందని సమాచారం. ఈ లోక్‌సభ స్థానాల పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నెగ్గినా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై కమిటీ విశ్లేషణ చేస్తోందని తెలుస్తోంది. 

ఇది శుభపరిణామం: దానం

గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్  ఫైండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. దేశంలో  ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి పద్ధతి లేదని, ఇది కొత్త విధానమని అన్నారు. జరిగిన లోపాలు సరిదిద్దు కోవడానికి మంచి అవకాశమని చెప్పారు. తన ఓటమికి కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని కురియన్ కమిటీకి తెలియజేశానని అన్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్లు రిపోర్ట్ ఇచ్చాను: కావ్య

కురియన్ కమిటీ గెలిచిన, ఓడిన అభ్యర్థులతో సమావేశమైందని వరంగల్ ఎంపీ కడియం కావ్య చెప్పారు. పలుచోట్ల ఓటమికి కారణాలు అడగారు.. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి టర్న్ అయ్యిందనట్లు చెప్పానన్నారు. తాను లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నివేదిక ఇచ్చానని తెలిపారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కురియన్ అడిగారని అన్నారు.