గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ భరోసా

గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ భరోసా
  •  అక్కడ మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా
  • సీఎం సహాయనిధి నుంచి కేటాయింపు
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలిసారిగా చెక్కులను అందజేసిన విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: అప్పుల బాధతోనో, బతుకుదెరువు కోసమో గల్ఫ్​దేశాలకు పోయి ఏదైనా కారణంతో మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను అందిస్తోంది. సీఎం సహాయనిధి నుంచి ఈ ఫండ్స్​ కేటాయిస్తోంది. దీనికి సంబంధించిన చెక్కులను మొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రెండు బాధిత కుటుంబాల వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెండు  రోజుల కింద అందజేశారు. 

కోనరావుపేట మండలం బావుసాయి పేటకు చెందిన బొడ్డు బాబు బెహరాన్ లో గత ఏడాది డిసెంబర్​లో పైప్ లైన్ పనులు చేస్తుండగా ప్రమాదం జరగడంతో చనిపోయాడు. అలాగే వేములవాడ మండలం మర్రిపెల్లికి చెందిన శశికుమార్ సౌదీ అరేబియాలో గత నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా, వీరి కుటుంబానికి కూడా ఆది శ్రీనివాస్​ ఐదు లక్షల చెక్కు అందజేసి ధైర్యం చెప్పారు.   

హామీ ఇచ్చి నెరవేర్చని బీఆర్ఎస్​ 

పదేండ్లలో తెలంగాణ నుంచి వలస వెళ్లిన రెండు వేల మంది గల్ఫ్​కార్మికులు మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే, గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం గల్ఫ్​ కార్మికులను ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని చెప్పి పదేండ్లను వృథా చేసింది. కేరళ తరహాలో రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. గల్ఫ్ ​వెళ్లే కార్మికులకు ఉచిత శిక్షణ కూడా ఇస్తామని చెప్పింది. కానీ,  ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది.  

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్​ సర్కారు  

రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి అత్యధికంగా గల్ఫ్​ దేశాలకు వలస వెళ్తుంటారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మంది వలస వెళ్లి గల్ఫ్​లో పని చేస్తున్నారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బెహరాన్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. 

వీరిలో ఎవరైనా ప్రమాదవశాత్తు, లేక ఇతర కార ణాల వల్ల చనిపోతే ఇక్కడ వారి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఇంతవరకు ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపానపోలేదు. గల్ఫ్​లో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్​ ప్రకటించింది. అన్నట్టుగానే సీఎం సహాయనిధి నుంచి రూ.5 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చి ఆదుకుంటోంది. దీనిపై గల్ఫ్​సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గల్ప్ మృతుల  కుటుంబాలకు చేయూత

గల్ఫ్​లో ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అన్నట్టుగా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నాం. దీంతో పాటు ఇన్స్యూరెన్స్​, పింఛన్లతో కూడిన ప్రవాసీ యోగ క్షేమ పథకాన్ని ప్రవేశపెడతాం. సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత విధి విధానాలు ఖరారు చేసి పాలసీ రూపొందిస్తాం. 
- ఆది శ్రీనివాస్, విప్​, వేములవాడ ఎమ్మెల్యే

సర్కార్ ఐదు లక్షలిచ్చింది 

నా భర్త బొడ్డు బాబు చనిపోవడంతో నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. చిన్న వయసులోనే నా భర్త చనిపోవడంతో దిక్కులేనివాళ్లమయ్యాం. నా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు వచ్చాయి. ఇది బాగానే ఉన్నా  గల్ఫ్​లో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఏదైనా పని కల్పిస్తే  బాగుంటది. కాంగ్రెస్​ సర్కారు అన్నమాట ప్రకారం పైసలివ్వడం అభినందనీయం.  

- బొడ్డు శిరీష, బావుసాయిపేట, 
   రాజన్న సిరిసిల్ల జిల్లా